ఈ మహానుభావుని గురించిన విస్తారమైన పదచిత్రం పూజ్యమైన డీ.వీ. గుండప్ప గారి కలం నుండి 'జ్ఞాపక చిత్రశాలె' అనే గ్రంథమాలలో జాలువారింది. డీవీజీ స్వయంగా ఆచార్య మైసూర్ హిరియణ్ణ గారితో సంభాషించి వారి, స్వతః సిద్ధమైన శైలిలో ఆ పండిత - తత్త్వవేత్త భావసారాన్ని సునిశితంగా , సుమనోహరంగా ఆవిష్కరించారు. శతావధాని డా . గణేశ్ , ఆచార్యులవారి జీవిత చరిత్రను 'ఆర్ద్ర జ్యోతి' అనే పేరుతో అద్భుతంగా రచించారు.
ఆయన ఒక మూర్తీభవించిన సనాతన ధర్మము. వారి బహుముఖ ప్రజ్ఞ పట్టకము నుండి వెలువడిన కాంతి వలె బహువర్ణ మయము. వారి శిష్య వర్గం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఆచార్యుల వారి పట్ల ఎనలేని గౌరవ ప్రపత్తులు కలిగిఉండేవారు. వారందుకున్న ప్రశంసల నుండి ఉదాహరణకు కొన్ని.
మొదటిది , వారి వద్దనే చదువుకున్న కన్నడ కవి శ్రీ పీ . టీ. నరసింహాచార్య, వారి ప్రశంస:
మైసూర్ హిరియణ్ణగురువర్యులు స్థితప్రజ్ఞులు. వారి గుణంలో అభిజాతపురుషులు - అనగా వారు ఏమి ప్రదానం చేశారనేది తీసుకున్నవాడికి తప్ప వేరేవరికీ తెలియదు - అహంకారము లేని ఐశ్వర్యవంతులు, నిరంతర విద్యావ్యాసంగ తత్పరులు. నా ఉద్దేశ్యంలో భారతీయ సంస్కృతిని జీర్ణించుకున్న సంపూర్ణ మానవులు. పాశ్చాత్య భావజాలము, సంస్కృతిని దరిజేరనీయకతన ఉనికిని నిలబెట్టుకున్న విశిష్ట భారతీయుడు.
రెండవ ప్రశంస, కూడా ఆయన వద్ద విద్యనభ్యసించిన చురుకైన విద్యార్థి యన్ . శివరామ శాస్త్రి గారిది.
నిరాడంబరమైన వ్యక్తిత్వం ....... సమయాన్నంతా తన అధ్యయనానికే వెచ్చించారు, తన ఆధ్యాత్మిక సాధనలతో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు. మాట వారి స్వరం మృదువుగాను ఆకట్టుకొనేదిగా ఉండేది. ఆయన సాధనలన్నీ ఒంటరిగానూ , నిశ్శబ్దము గానూ నడిచేవి. ఆయన సమాజంలో గుర్తింపు కోరినవారు కాదు, వచ్చినప్పుడు ఎంతో బిడియపడేవారు. మైసూర్ ప్రాచ్య గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి ఉద్యోగంలో ఉన్న మైసూర్ హిరియణ్ణ గారిని మైసూర్ విశ్వవిద్యాలయం మొదటి ఉప కులపతి, విద్యావేత్త, కార్యదక్షుడు హెచ్.వీ. నంజుండయ్య గారు సంస్కృతోపన్యాసులుగా ఎంపిక చేసినప్పుడు స్థితప్రజ్ఞులైన వారు ఎటువంటి ఉత్సాహోద్వేగాలకు లోనుకాలేదు. గ్రంథాలయాధికారిగా 1358 ప్రాచీన కన్నడ, సంస్కృత లిఖిత ప్రతులను సేకరించి, సంస్కరించిన , పరిష్కరించిన ఘనత వారిది. ఉద్దండ పండితులైన శ్రీ రాధకుముద్ ముఖర్జీ , డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారలతో సాన్నిహిత్యము కలిగిన వైదుష్యము వారిది.
మూడవ ప్రశంస, వారి సమకాలికులు డీవీజీ'జ్ఞాపక చిత్రశాలె' సంపుటాలలో వెలువరించిన రచనాచిత్రమే. నేనెంతో ఇష్టపడే రచన అది. అది ఒక రచన అనడం కన్నా ఒకజ్ఞాన సముద్రాన్ని,వారి బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ఏర్చి కూర్చిన ఒక విజ్ఞాన మంజూష అనడం న్యాయం. అందులోంచి ఒక్క మెరికనన్నాఏరకుండా ఉండడం అసాధ్యం.
డీవీజీ 'నీలలోహిత' అనే పదానికి సరైన అర్థమేమిటి , అని అడిగారు. ఆచార్య మైసూర్ హిరియణ్ణ వారిని ఇంటికి పిలిచి తను వ్రాసుకొన్న టిప్పణి చూపారు. అందులో అర్థ వివరణమే కాకుండా, వాడుక, సందర్భవివరణలు అన్నీ ఉన్నాయి, అది కూడా ఈ ఒక్క పదానికే, మూడు నోటు పుస్తకాల వివరణ ఉన్నది. అయినా ఇంతకుమించి వేరే ఏమీ లేదని వారెప్పుడూ అనలేదు, ఇంకా ఆలోచించి వెదికితే ఇంకా తెలియవచ్చు అని డీవీజీ తో అన్నారు. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృత పండిత బృందాలలో వారు సుప్రసిద్ధులై ఉన్నారు.
ఇదే వారి అధ్యయన విధానం, - స్వీయ అధ్యయనం, అందువలన పాండిత్యం, వినియోగం - అధ్యాపనం. ప్రతిఒక్క పదాన్ని వాక్యాన్ని, వాక్యసముదాయాన్ని సునిశితంగా పరిశీలించి , సాహిత్యంలో ఆ పదాలు వాడిన విధానం తెలుసుకొని విస్తృత వివరణలు వ్రాసుకొనేవారు. ప్రతి పదంపై దీర్ఘ పరిశోధన చేయకుండా నోరు విప్పేవారుకాదు. ఇంతటి నిర్దుష్ట పరిశ్రమ, నిబద్ధత ఉన్నందువలననే వారి వ్రాతల్లో అనుకరణకు అసాధ్యమైన భాషా వైదుష్యం గోచరిస్తుంది. అందుచేతనే ఇతరులు ఒక పుటలో వ్రాసే విషయాన్ని ఒక వాక్యంలో చెప్పగలిగే వారు.
ఇటువంటి విలక్షణమైన అధ్యయన ప్రణాళిక ఆయన అధ్యాపన జీవితంలో ఎన్నడూ మారలేదు.
గురు -శిష్య పరంపరలో ఉన్నట్లుగా ఆచార్య మైసూర్ హిరియణ్ణ తన శిష్యవర్గానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. వారి మార్గదర్శకత్వం కోరిన ఉత్తమ విద్యార్థులను , నిర్ణీత సమయంలో ఇంటికి రావలసినదిగా కోరేవారు. వారి క్రమశిక్షణ, వారి అవగాహన స్థాయిలను పరిశీలించి మార్గనిర్దేశనం చేసేవారు. ఆయన ఇచ్చిన సమయానికి విద్యార్థి కోసం ముఖద్వారం వద్దనే వచ్చి వేచి ఉండేవారు. ఆలస్యంగా వచ్చాడంటే వాడికి సూక్ష్మ మైన విషయాలు ఎన్నో అందేవి కావు.
ఆయన తన జీవన సాధన విధానాన్ని రంగరించి వ్రాసిన గ్రంథమే - 'ఏ క్వెస్ట్ ఫర్ పర్ఫెక్షన్ 'యథార్థ పరిగ్రహణమే లక్ష్యంగా వారి సాధననుకొనసాగించారు. యథార్థము గ్రహించాలంటే - అవసరము లేనివి , ఇతరములైన మాలిన్యాలను పరిహరించవలసి ఉంటుంది. పక్షపాత ధోరణులను, చిత్త విక్షేపమునుదూరం చేయవలసి వుంటుంది. శిల్పం యొక్క సంపూర్ణ సౌందర్యం అనవసరమైన రాతిని చెక్కివేయడం ద్వారా ఆవిష్కరించ బడుతుంది ప్రసిద్ధ శిల్పకారుడన్నట్లుగా యన్నమాట.
ఆచార్య పదానికి అసలైన నిర్వచనమేఆచార్యమైసూర్ హిరియణ్ణ, రెండు తరాల పండితులనుతీర్చిదిద్దినపండిత ప్రకాండుడు.టీ యన్. శ్రీకంఠయ్య , యమునాచార్య ( వీరు ఎస్ . ఎల్ . భైరప్ప గారి గురువు ),ఎన్. శివరామ శాస్త్రి , ఏ.ఆర్. కృష్ణ శాస్త్రి , పీ.టీ. నరసింహాచార్య , జీ . హనుమంత రావు మొదలైన పండితులందరూ వారి శిష్యులే . ప్రసిద్ధ భారతీయ కళాతత్త్వశాస్త్రనిపుణుడు డా . వి . రాఘవన్ కూడా వీరి నుండి నిర్దేశాలను స్వీకరించేవారు. 'భారతీయ విద్య అనగా బుద్ధికి ఎరుకను కలిగించుట కాదు బుద్ధినికలిగించడమే' అని వారి అమృతతుల్యమైన వాక్యానికి వీరందరూ నిలువుటెత్తు ఉదాహరణలు వారిది అవిశ్రాంతఅధ్యాపకత్వం. ఎదుటివారినిప్రభావితం చెయ్యగల వ్యక్తిత్వంగల మనుషులను ఈ రోజుల్లో అరుదుగా చూస్తాం. - తన నడవడిక మూలముగాఎదుటివారిలో మార్పు తీసుకురాగలిగినవిశేష వ్యక్తి వారు. వారి శిష్యులుయన్. శివరామ శాస్త్రి గారి మాటల్లో చెప్పాలంటే - మైసూర్ హిరియణ్ణగారిని గురించి వారి విద్యార్థులకు తెలిసినంతగా ఆయన బంధువులకు కూడా తెలిసిఉండదు. అందుచేత మైసూర్ మహారాజా కళాశాలలో' ముని' గా వారికి గుర్తింపు లభించింది. వారి వద్దకు వచ్చిన ఏ జిజ్ఞాసువు అయినా జ్ఞానభిక్ష పొందకుండా వెళ్ళేవారు కాదు.
19 - 20 శతాబ్దాల మధ్యకాలం భారతీయ పునర్వికాసానికి కృషి సల్పిన దిగ్దంతులు పీ.వీ.కాణె, బాలగంగాధర తిలక్, ఆర్. జీ. భండార్కర్, గంగానాథ్ ఝా , వీ ఎస్ సుఖ్తాంకర్ , ఎస్. కుప్పుస్వామి శాస్త్రి, సంప్రదాయ విద్వాంసులు కునిగల్ రామశాస్త్రి, హనగల్ విరూపాక్ష శాస్త్రి , బెల్లంకొండ రామరాయ కవి, మొదలైన అద్భుత ప్రతిభావంతులు సమకాలికులైన కాలంలో ఇంతటి ప్రసిద్ధిని పొందడం తేలికైన విషయం కాదు.
పాశ్చాత్య పోకడలు, భావాలుదాడి చేస్తున్నతరుణంలో సనాతన భారతీయ సంప్రదాయాలను ఆదర్శాలను నిలుపుకోవాలన్నా , అధ్యయనం చేయాలన్నా ఆచార్యమైసూర్ హిరియణ్ణ గారు ఏర్పరచిన విధి విధానాలు శిరోధార్యం.ఆయన కాలంనాటివిద్వాంసులలో కూడా సనాతన భావాలను వారిలాగా క్లుప్తంగా, సూటిగా, హృదయంగమంగా వ్రాయగల సమర్థులు అరుదుగానే ఉండేవారు.
ఉదాహరణకు, “Vedanta is the art of right living more than a system of philosophy,” అని చెప్పినపుడు, ఆ తేలికైన వాక్యం లోని గూఢమైన భావం మనలను అబ్బుర పరుస్తుంది. అంత సులభమైన వాక్యంలో ఒక వేదాంత రహస్యాన్ని ఇమిడ్చాలంటే , వారి అధ్యయనమే ఒక తపస్సు అనే విషయం బోధపడుతుంది. వారి రచనల అధ్యయనమే ఒక విద్యావ్యాసంగం అందువలన మనం ఎలా ఆలోచన చెయ్యాలి, స్పష్టంగా ఎలా వ్రాయాలి అనే అవగాహన ఏర్పడుతుంది.
మైసూర్ హిరియణ్ణ గారి సమకాలీకుల రచనలతో పోలిస్తే వారి రచనలు సంఖ్యాపరంగా తక్కువే. వేదాంతము, సనాతన ధర్మము, కళాతత్త్వ శాస్త్రముల మీద వారి రచనలు - 'ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ', 'ఔట్లైన్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ', 'ది క్వెస్ట్ ఫర్ పర్ఫెక్షన్ అండ్ ఆర్ట్ ఎక్స్పీరియన్స్' సజీవంగా నిలిచే అనర్ఘ రత్నాలు. ఈ గ్రంథాలలో ఉదాహరించ దగిన వాక్యాలు త్రవ్వినకొద్దీ దొరుకుతాయి.
ఇండోలజీ , ఇండిక్ స్టడీస్ అని అసంగతమైన నామములతో పిలువబడే అధ్యయన భాగానికి దర్శన శాస్త్రమని పేరు. ఈ అధ్యయన క్రియలో మైసూర్ హిరియణ్ణగారిని తలుచుకోవడం నేటి పరిస్థితులలో తప్పనిసరి.
దురదృష్టవశాత్తూ ఈ అధ్యయన విషయం విద్యావిషయికం కాకపోగా రాజకీయ, సైద్ధాంతిక సంఘర్షణల రణరంగంగా మారింది. గత ఏడు దశాబ్దాలుగా పాశ్చాత్యుల రాజకీయ శక్తులు, పాశ్చాత్య దురభిమానులు, ఆ శక్తుల ఆధీనములోని భారతీయకాల్బలం ఈ విద్యారంగాన్నిఏలుతూ ఉన్నాయి. ఏ కొద్దిమందినో వదిలేస్తే , వారిని ఎదిరించి నిలబడి సత్యావిష్కరణ చేయగలిగిన సత్తా కలిగిన విద్వాంసులు , పండితులు ఎందరో లేరు.
అటువంటి దయనీయ స్థితిలో ఆచార్య మైసూర్ హిరియణ్ణ తన సునిశిత మేధా సంపత్తితో మాక్స్ ముల్లర్ వంటి ఎందరో పాశ్చాత్య ఇండోలజిస్టుల సైద్ధాంతిక వైరుధ్యాలను ఖండించి, సత్యమేమిటో స్పష్టం చేశారు.
మాక్స్ ముల్లర్ ప్రతిపాదన - "హిందూ మైండ్ హాడ్ నో కాన్సెప్షన్ ఆఫ్ బ్యూటీ ' అనే దురహంకారపూర్వక ప్రతిపాదనను చురుకు తగిలేట్లుగా ఖండించిన విధానం అపూర్వం. నిజంగా చెప్పాలంటే మాక్స్ ముల్లర్ ప్రతిపాదన లో పాండిత్యప్రకర్ష కన్నా జాత్యహంకార భేషజం కనిపిస్తుంది. మాక్స్ ముల్లర్ మొదలుకొని డయానా ఈక్, షెల్డన్ పోలాక్ వరకు వారి అధ్యయన విధానం భారతీయ సంప్రదాయాలు , సంస్కృతి , తత్త్వ శాస్త్ర విషయాల్లో - బ్రతికున్న కప్పను కోసే జంతుశాస్త్రవేత్త లాగానో , మ్యూజియంలో ప్రాచీన వస్తు రక్షకుడి లాగానో, లేదా గతించిన విషయాలను త్రవ్వితీసే పురాతత్వ శాస్త్రజ్ఞుడి వలెనో ఉంటుంది. వెలుగు చొరనివ్వని వారి మనోవికార స్థితి ఇంతకంటే భిన్నంగా ముందుకు వెళ్ళదు.
ఆచార్య మైసూర్ హిరియణ్ణ ఈ అపాయాన్ని ఎనుబది సంవత్సరాల క్రిందటే ఊహించి హెచ్చరిక చేశారు.
ప్రతికూల శక్తుల విజృంభణము, లౌకికవాద ఆక్రమిత జీవనము వలనభారతీయ ఆదర్శాలు మసకబారిపోవచ్చు లేదాలుప్తమైపోయేప్రమాదముకూడా లేకపోలేదు అన్నారు . భారతపునర్నిర్మాణం జరగాలంటేకొందరు 'దేశభక్తుల వర్గము' ఒకటి తయారై ,నిజాయితీతో , నిబద్ధతతో అధ్యయన శీలురైగతాన్ని సరయిన అవగాహనతో విశ్లేషించి తెలియజేస్తూ ముందుకు పోవవలసి ఉంటుంది.
వారి గ్రంథములు, వారు మనకు ప్రసాదించిన వారసత్వ సంపద వారు కోరిన పునర్నిర్మాణానికి మార్గదర్శకాలు కాగలవు. అలౌకిక ఘటనలు , అనుభూతులు మొదలయిన విషయాల ఆధారంగా భారతీయ తత్త్వశాస్త్రాన్ని అధ్యయనం చేసే వారు ఉత్తమ పాఠకులే కావచ్చు , వారికి సరైన అవగాహన కోసం మైసూర్ హిరియణ్ణ గారి గ్రంథములు అవశ్య పఠనీయములు. సంస్కృతీ పరంగా ఆత్మస్థైర్యాన్ని గడించాలంటే ఆచార్యులవారు ప్రతిపాదించి ఆచరింపజేసిన శిక్షణా విధానము అనివార్యము.
ఒక ఉత్తమస్థాయి తత్త్వవేత్తగా , అసమాన ప్రాజ్ఙునిగా ఎదిగిన మైసూర్ హిరియణ్ణగారి తొలినాటి శిక్షణ ఏవిధంగా నడిచిందో తెలుసుకోవాలంటే మళ్ళీ మనం డీవీజీ ఏమి చెప్పారో చూడాలి :
వారు సంస్కృతాన్ని సంప్రదాయిక పద్దతిలో నేర్చుకున్నారు........ మైసూర్ సద్విద్యాశాల లో అమరకోశము, ధాతువులు క్షుణ్ణంగా నేర్చుకుని ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. ఆ తర్వాతనే ఆంగ్ల విద్యాభ్యాసము. సంప్రదాయిక విద్యలో ఏర్పడిన దృఢమైన పునాది వలన తరువాత చదివిన ఆంగ్ల విద్యలో కూడా వారి విద్వత్తు సర్వతోముఖ వికాసము పొందినది.
దురదృష్టవశము వలన ఈ విధమైన సాంప్రదాయిక మౌలిక విద్య నేడు, దాదాపు లుప్తమైనది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్నో కారణాల చేత ఉద్దేశ్యపూర్వకం గా ఈ విద్య అణగద్రొక్కబడింది. గత నలుబది సంవత్సరాలుగా ఏవేవో సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఇటువంటి సర్వోత్తమ విద్యా విధానాన్ని అమలుచేసే ఆలోచనలు మాత్రం చేయలేదు. ఇంత కన్న ఎక్కువగా చెప్పడం ఇక్కడ అప్రస్తుతం.
ఆచార్య మైసూర్ హిరియణ్ణ రచనలు కాలక్రమ సంబంధం లేక శాశ్వతత్వం కలిగిన సజీవ సాహిత్యం పది కాలాలపాటు స్ఫూర్తి ప్రసాదించగలిగిన శక్తి కలిగినవి.
ఎనుబది సంవత్సరాల క్రిందట వ్రాయబడి నేటికీ ఆశావహదృక్పథాన్ని కలిగించేవారి రచనలు లోతుగా చదివే చదువరి దగ్గరనుండి సామాన్య పాఠకుడి వరకు ఆకర్షిస్తూనే ఉన్నాయి. బ్రిటీషు వారి వలసపాలన కాలంలో ఇంతటి అసమాన ప్రతిభతో గ్రంథ రచన చేసి లబ్ధప్రతిష్ఠులైనారనే విషయం గుర్తుపెట్టకోవాలి.
|| महाजनो येन गतः स पन्थाः ||
ఆచార్య మైసూర్ హిరియణ్ణ అద్భుత రచనలు ప్రేక్షా జర్నల్ వారు అందమైన బౌండ్ పుస్తకాలలో 'మైసూర్ హిరియణ్ణ లైబ్రరీ' అనే పేరుతో వెలువరించారు. కొనదలచిన వారు ప్రేక్షా జర్నల్ వారి వెబ్సైట్ దర్శించ వచ్చు.
The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.