భారత స్వాతంత్ర్య ఉద్యమ అంతరాత్మవలె సాహిత్య , సామాజిక ,సాంస్కృతిక, రాజకీయ రంగాలో జరిగే కృషిలో తానే లీనమై స్ఫూర్తిని కలిగించారు.
ఆయన అన్ని వర్గాల ప్రజలతో అవినాభావ సంబంధము కలిగి వారిలో ఒకరై పోయేవారు. ఆయన స్నేహితులు , మిత్రవర్గము ఎంత విస్తృతి కలిగినదో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది - అందులో టాంగా డ్రైవర్లు , తాపీ పనివారు , వైద్యులు , న్యాయవాదులు , ప్రభుత్వ అధికారులు , సంగీతజ్ఞులు , నాట్యకత్తెలు , దేవదాసీలు , ఇంజనీర్లు, సాధు సంతులు , సంఘ సంస్కర్తలు, విద్యావేత్తలు, సంస్థల అధిపతులు , విద్వాంసులు, సాహిత్యవేత్తలు, విద్యార్థులు, పాత్రికేయులు , స్వాతంత్ర్య సమర యోధులు , ప్రజా ప్రతినిధులు , దివానులు ఉండేవారు. సమాజంలోని సూక్ష్మప్రవృత్తులు , వృత్తులు , ప్రయత్నాలు అన్ని కూడా విలువైనవిగా భావించేవారు.
డీవీజీ రచనలలోని ఒక ప్రత్యేక లక్షణం - సిద్ధాంతము - ఆచరణ - ఈ రెండింటి యొక్క వివేకవంతమైన మేళవింపు స్ఫుటంగా ద్యోతకమౌతుంది, ఇంకా అందంగా చెప్పాలంటే ఈ రెండింటి మధ్య పొందికైన వివాహము జరిగినట్లు ఉంటుంది. ఉదాహరణకు 1973 లోవారి 'రాజ్య శాస్త్ర' అనే సుప్రసిద్ధ గ్రంథానికి వ్రాసిన ఉపోద్ఘాతంలో ఇలా అన్నారు
కమ్యూనిస్టు సిద్ధాంతము రష్యాలో వాస్తవముగా ఎలా పనిచేస్తున్నది అనేది ఇంకా తెలియవలసి ఉన్నది. ఆ ప్రభుత్వం వారి ప్రకటనలు ప్రక్కన పెట్టండి; తమను తాము సమర్థించుకోవడం సహజం. వారి నిజాయితీ ని నమ్మాలంటే ప్రభుత్వేతర ఋజువులు కావాలి. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కాసేపు ప్రక్కన పెట్టండి; సరుకులన్నీ బజార్లలో లభ్యమౌతున్నాయా ? లభ్యమైతే ధరలు ఎలావున్నాయి? ఒక సామాన్య గుమాస్తా , ఒక బడిపంతులు, మధ్యతరగతి జనుల దినవారీ జీవితాలు ఎలా నడుస్తున్నాయి ? సెలవుల్లో , పండుగరోజుల్లో ఎట్లా ఉంటున్నారు ? వారు రుచికరమైన ఆహారం తింటున్నారా ? ఈ విషయాలపై ఆరా తీయాలి.
సామాన్య ప్రజల జీవితముపై సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టే, ఆయన చలికాలపు రాత్రుళ్లు బెంగళూరు లో నిలబడి ప్లేగు బాధితులకు దుప్పట్లు పంచారు. విధవా వివాహానికి నిషేధాలున్న రోజుల్లో ఆయనే పురోహితుడుగా విధవావివాహాలు జరిపించారు.
మహోన్నత ఆదర్శాలతో 'కన్నడ సాహిత్య పరిషద్' వంటి సంస్థలను ను తీర్చిదిద్దడంలో ఆయన కృషి అపారం. ('కన్నడ సాహిత్య పరిషద్' తరువాత రోజుల్లో రాజకీయాలు - అవినీతి ఊబిలో కూరుకుపోవడం ఒక దుర్ఘటన.) అటువంటి ఆదర్శాలతోనే గోఖలే ఇన్స్టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ (గీపా) వారిచే స్థాపించడం జరిగినది.
ప్రజాసంబంధాలలో, రాజకీయాలలోడీవీజీభావన, ఆచరణ గీతాచార్యుడు చెప్పినట్లుగా, వేదాంతానుగుణంగా ఉంటాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకాచార్యుడు మహర్షి విద్యారణ్య స్వామి వారికిఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత. అలాగే రాజకీయాల్లో ప్రాచీన గ్రీకు తత్త్వవేత్తలు కూడా. గోపాల కృష్ణ గోఖలే వారి సూక్తి ' ప్రజాజీవితము అధ్యాత్మికతో ముడిపడి ఉండవలెను' డీవీజీనరనారాల జీర్ణించుకున్నసత్యం.
ರಾಮಣೀಯಕವೆಂದು ಬಿಸುಸುಯ್ಯಲದು ಕವಿತೆ
ಭೂಮಿಗದನೆಟುಕಿಸುವೆನೆಂಬೆಸಕ ರಾಷ್ಟ್ರಕತೆ ||
అందానికి ఆనందించేవాడు కవి
అనుభవించేవాడురాజకీయ నేత
డీవీజీ రాజకీయ రచనలు పరిశీలించినప్పుడు మనమొక వైదిక మహారణ్యంలో ప్రవేశించినట్లు భావన కలుగుతుంది. ఆ వైదిక భావనే ఆయన రాజకీయాలను స్పృశించినప్పుడు ఆయనలో స్పూర్తి కలిగించిందని తెలుసుకోవచ్చు. వారి మరొక ప్రామాణిక గ్రంథం ' రాజ్యాంగ తత్త్వగళు 'యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ బ్రాహ్మణములోని ఆవహన ఋక్కు( అశ్వమేధ యాగానికి సంబంధించిన భాగము లోనిది)తో ప్రారంభం చేశారు. ఈ ఋక్కును 'నేషనల్ ఆన్థం ఆఫ్ ఋషీస్' అని అభివర్ణించారు.
వైదిక భావనలో'రాష్ట్రము' (ఆంగ్లంలో నేడు 'నేషన్’, లేదా 'కంట్రీ ' గానో ప్రాచుర్యంలో ఉన్నది) అనగా ఒక నిరంతర అశ్వమేధ యాగము, ఆ స్ఫూర్తి ఈ క్రింది ముగింపులోధ్వనిస్తుంది.
మనకు మంగళము, క్షేమము, రక్షణ, సమృద్ధి కలుగుగాక! ఈ యజ్ఞము వలన ప్రజలు శాంతి, ఐకమత్యము కలిగి శుభములు పొందెదరుగాక!
ఈ విధముగా రాష్ట్రానికి - అశ్వమేధ యాగానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది.
ధర్మమే ఆధారముగా శ్రీకృష్ణుడు , కౌటిల్యుడు , విద్యారణ్యుల సంప్రదాయములను గౌరవించే డీవీజీ రాజనీతి తత్త్వాన్ని, రాజ్యనిర్వహణ , రాజనీతిజ్ఞత ను , సామాన్య ప్రజాజీవనాన్ని కూడా వైదిక 'దర్శన'ముల స్థాయిలో చూడడంలో ఆశ్చర్యపడవలసిన పనిలేదు.
డీవీజీ ఆదర్శాలు , నమ్మకాలు , ఆయన జీవితకాల పరిశ్రమ అంతా సమాజములోని పరస్పర పూరకమైన ఈ క్రింది అంశాలమీదనే ఆధారపడ్డాయి.
1. కళలు - సాహిత్యము
2. రాజనీతిశాస్త్రము - ప్రభుత్వము
3. శాస్త్రము , సాంకేతికశాస్త్రము , అర్థశాస్త్రము
4. తత్త్వ శాస్త్రము - జీవితము.
పైన పేర్కొన్న అంశాలను పరస్పరవిరుద్దమైనవి కాకపోయినా కూడా వేర్వేరుగా భావన చేసే సమకాలీన దృక్పథానికి భిన్నమైన దృక్పథాన్ని డీవీజీ అనుసరించారు. డీవీజీకి కలిగినసమగ్రము , తాత్వికము అయిన దృక్పథము ఈ క్రింది నాలుగు కారణాల వలన ఏర్పడింది.
1. భారతీయ, పాశ్చాత్య శాస్త్రాలలో విస్తృత పరిజ్ఞానము , పాండిత్యము
2. ప్రజలతో , సంస్థలతో మమేకమై గడించిన జీవితానుభవము
3. నమ్రతతో , వినయము తో నేర్చిన ప్రతి అనుభవాన్ని తిరిగి ప్రజలకు అందజేయలనే తపన , అందజేయగలిగిన నేర్పు.
4. వేదాంత విషయాలపై లోతైన అవగాహన , స్థిరమైన నమ్మకం
'ప్రజాజీవితము అధ్యాత్మికతో ముడిపడి ఉండవలెను' అనే గోఖలే సూక్తి ఆచరణలో ప్రతిఫలించడం డీవీజీ జీవితంలోనూ, ఆయన నిర్వహించిన కార్యాలలోనూ చూడవచ్చు. ఉద్రేకంతో ఆవేశం తో ఊగిపోతూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. భారీ ఉద్ఘాటనలు చెయ్యలేదు. రాత్రికి రాత్రి మార్పులు రావాలని ఆశించలేదు, హింసాత్మక విప్లవాలకు పురికొల్పలేదు. జాతీయ జీవనానికి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా లోతుగాను విస్తృతంగానూ ఆలోచించి, విశ్లేషించి ,సమస్యను అన్ని కోణాలలో పరిశీలించిజవాబులను అన్వేషించి స్వార్థరహితంగా తెలియజేసేవారు.
డీవీజీ వారి పాండిత్యము , ధిషణ , నడవడిని ఆ నాటి వివిధ రంగాలలోని విశిష్ట వ్యక్తులు ఎందరో గౌరవించారు. మైసూర్ రాజరిక రాష్ట్రానికి చెందిన దివానులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య , సర్ మీర్జా ఇస్మాయిల్ గారలు ముఖ్యమైన విషయాల్లో వారిని సంప్రదించేవారు. 1915 లో మహాత్మా గాంధీ ని బెంగుళూరు పిలిపించినవారు డీవీజీయే. గాంధిగారే గోఖలే ఇన్స్టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ (గీపా) ను ప్రారంభించారు.
"రైట్ ఆనరబుల్" వీ ఎస్ శ్రీనివాస శాస్త్రి గారు రాజనీతి , పరిపాలన , జవాబ్దారీ ప్రభుత్వము మొదలైన విషయాల్లో డీవీజీ సలహాలు తీసుకునేవారు.
కులాలు - సాంఘిక సంస్కరణల విషయాల్లో డా. అంబేద్కర్ కూడా సలహాలకై వారిని సంప్రదించారు. సమకాలీన కన్నడ సాహిత్యలోఉద్దండ పండితులు ఏ. ఆర్ . కృష్ణ శాస్త్రి , టీ. ఎస్ . వెంకన్నయ్య , పుంజె మంగేశ్వర రావు , దేవుడు నరసింహ శాస్త్రి , మాస్తి వెంకటేశ అయ్యంగార్ , కె. వి . పుట్టప్ప, బీ. యం. శ్రీకంఠయ్య మొదలైన వారందరూ డీవీజీని ఎంతగానో గౌరవించేవారు.
స్వతంత్ర రాజ్య సంస్థానాలను భారత యూనియన్ లో విలీనము చేసే విషయమై డీవీజీ లోతైన అధ్యయనము చేశారు. వారి అధ్యయన వివరాలు ప్రచురించబడినప్పుడు అగ్రరాజకీయ నాయకులందరి చేత ఆసక్తితో చర్చించ బడ్డాయి . రాజ్యసంస్థానాల చరిత్ర , ఆయా ప్రజల నమ్మకాలు సంప్రదాయాలు, వాస్తవిక పరిస్థితులు అన్నిటినీ కూలంకషంగా చర్చించిన ప్రథమ నివేదిక ఈ అధ్యయనము. నేటికి కూడ విశ్వవిద్యాలయాలలో పరిశోధన పత్రాలకు తగినంత విషయ విస్తారము అందులో ఉన్నది. ఈ సమస్య విషయమై 1947 లో స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత భారత రాజకీయాలలో వచ్చిన మార్పులలో తన విచారాన్ని సూచనగా తెలియజేశారు.
రాజ్య సంస్థానాల విలీనం మీద వారి అధ్యయనం ఒక విశిష్టమైన మైలురాయి , అనంతత్వమే జీవమైన భారతవర్షమనే భావన యొక్క పరిభాష.ఆ భావన యొక్క అభివ్యక్తి డీవీజీ వ్రాసిన 'స్వతంత్ర భారత స్తవ' లో ద్యోతకమౌతుంది. ఈ స్తవము భారతదేశానికి స్వతంత్రము వచ్చిన రాత్రే వ్రాయబడింది. "యోధుడు కానివాడు , జాతీయవాదియు కానివాడు ఈ పవిత్రభూమిలో జన్మించకుండు గాక" అనే భావము గల మకుటముతో స్తోత్రము, డీవీజీ దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రస్ఫుటం చేస్తున్నది.
డీవీజీ భావనలో 'రాజ్యము' లేదా 'రాష్ట్రము' అంటే ఏమిటో వారి ప్రామాణిక గ్రంథం -’ రాజ్య శాస్త్ర ' లో వివరించారు :
రాజ్యము అనేది ఒక కుటుంబము వంటిది . అది ఒక ధర్మక్షేత్రము . ఎలాగైతే కుటుంబము , అహంకారాన్నినియంత్రించి అంతరాత్మకు విస్తృతిని కలుగజేస్తుందో, రాజ్యము కూడా అటువంటి సాధనమే. ఏవిధంగా మనిషి తన కుటుంబంతో బంధాన్ని పెంచుకుంటాడో , అదేవిధంగా దేశముతో పెంచుకున్న బంధం , హృదయం పరిపక్వమయ్యేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.
అదే విధమైన ప్రమాణికతతో భగవద్గీత పై వారి వ్యాఖ్యానాన్ని 'జీవనధర్మ యోగ'మనే పేరుతో సార్థకం చేశారు. అందులో వారి మాటల్లో :
నేను పాత్రికేయునిగా నా జీవనం సాగిస్తున్నాను. ప్రతిరోజూ రణగణధ్వనుల విపణిలో ఉంటాను. ఆలయాలు , మఠాలు నాకు దూరం .. పాత్రికేయునిగానే ప్రజాజీవనముతో నా సంపర్కం ఏర్పడింది. పాత్రికేయునిగా నా అనుభవం పెరిగినకొద్దీ , రాజకీయాలతో నా అనుబంధము, ధర్మానికి సంబంధించిన ప్రశ్నలు విశదము కాసాగాయి… క్రమంగా ధార్మిక సాహిత్యము ఒక జాతి మనుగడకు , పురోగతికి ఎంత అవసరమో ఇంకా స్పష్టముగా బోధపడింది.........ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోగల వివేకము లేకపోతే నాయకులనుండి ఎటువంటి రాజకీయాలు ఉద్భవిస్తాయి ?...... మన ప్రాచీన గ్రంథాలలో సనాతన ఆదర్శాలలో శక్తి, పటుత్వము ఉన్నట్లయితే సందర్భోచితముగా అవి స్వయంప్రకటమౌతాయి.
దురదృష్టవశాత్తు మనం ఎంతో లోతైన ఊబిలో కూరుకొని పోయాము. డీ వీ గుండప్ప - ఒక వేదాంతి - ఒక జాతీయవాది - ఒక రాజనీతిజ్ఞుడు - ఆయనకు లభించవలసిన గుర్తింపు ఇంకా లభించలేదు. కర్ణాటకలో కూడా ఆయన గుర్తింపు ' మంకుతిమ్మన కగ్గ ' వరకే పరిమితమైంది. ఒక పాత సామెతలో చెప్పినట్లు ఒక ధీరోదాత్తుడు, ఒక ధ్రువతార లాంటి వ్యక్తిని ఒక సన్యాసిగా పరిచయం చేస్తే, ఆయన కృషి అంతా కూడా మనకోసంకాదనేఆలోచనతో లోతుగా అధ్యయనం చేయడం మానేస్తారు. భ్రాంతిజనకమైన భక్తి అనే పరివేషము (halo ) ఒక నిజమైన సాధకునికన్ను కూడాకప్పుతుంది, ఎందుకంటే కనుగొనవలసినతాత్విక సత్యము ఆ పరివేషము వెనుకనే దేదీప్యమానముగా వెలుగుతున్నది కనుక. దీని పరిణామాలు ఊహించవచ్చు. డా. ఎస్ ఆర్రామస్వామి, (ప్రముఖ కన్నడ రచయిత, పాత్రికేయుడు ) గారి మాటల్లో "గత మూడు దశాబ్దాలలో'కగ్గ' ఒక కుటీర పరిశ్రమగా మారింది.’ అర్థం పర్థంలేని 'కగ్గ' లను సృష్టించి ఆ సాహిత్య ప్రక్రియను అభాసుపాలు చేశారు. ఇది 'కగ్గ' కు గాని డీవీజీ కి గాని న్యాయం చేసినట్టు కాదు.
కావున అత్యవశ్యకమే కాదు, డీవీజీ రచనలు అధ్యయనం చేయడం - తప్పని సరి - అని ఖండితంగా చెప్తున్నాను - డీవీజీ రచనలను క్షుణ్ణముగా చదివినప్పుడు మాత్రమే సరియైన లోతైన అవగాహన కలిగి డీవీజీ ప్రసాదించిన వారసత్వమేమిటో అర్థమవుతుంది. విలువలు దిగజారిన కాలములో నివసిస్తున్న మనకు డీవీజీ సాహిత్య సృష్టిని కూలంకషముగా చదవడము ముఖ్యము మాత్రమే కాదు తప్పనిసరి కూడా. ఎందుకంటే ఆయన ఒక శతాబ్దకాలపు కీలకమైన భారతదేశ సంఘటనాత్మక చరిత్రను వీక్షించి గ్రంథస్థం చేసిన మహానుభావుడు. కాని ఆయన రచనలకు దేశవ్యాప్తంగా లభించవలసిన ప్రోత్సాహం లభించక వెనుకబడి ఉండడం శోచనీయం.
అదలాఉంచినప్పటికీ, డీవీజీ జీవితము, వారసత్వ అధ్యయనము,చేసే యువతరానికి, స్ఫూర్తిని కలిగించి, ఈ ప్రాచీన భూమిని సంఘటితము చేసిన ఆదర్శాలు, వాటి ప్రభావము ఆచరణకు ప్రేరేపణ కలిగిస్తాయి
విద్యావేత్తలకు విద్వాంసులకు డీవీజీ గ్రంథ సంపుటాలు పరిశోధనలకు క్రొత్త మార్గాలను దర్శింపజేయడమే కాకుండా, ఆధునిక భారతీయ పునరుజ్జీవనానికి సంబంధించిన వివిధ అంశాలను నిక్షేపించిన నిధులవి. త్రొవ్వుకున్నవారికి త్రొవ్వుకున్నంత .
డీవీజీ పుట్టినరోజును జరుపుకొనేందుకు మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి ఆయన గ్రంథాలను శ్రద్ధతో చదువుకోవడమే. ఒక నిజాయితీ గల వ్యక్తి ఏదోవిధంగా నిజాయితీగా తన జీవనయానాన్ని కొనసాగించవచ్చు, కష్టాలను భరించవచ్చు, భరించలేక తిట్టుకోవచ్చు, తట్టుకొనేందుకు అర్థంలేని వినోదాలను ఎంచుకోవచ్చు. కాని డీవీజీని కనుగొన్న కొద్దిమంది అలాంటి వ్యక్తులు వెనువెంటనే తమ జీవితాన్ని మలచుకొని సాఫల్యం చేసుకోగలరు.
धर्मस्य तत्वं निहितं गुहायां
महाजनो येन गतः स पन्थाः ||
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయామ్
మహాజనో యేన గతః స పంథాః
ధర్మతత్త్వము సూక్ష్మము మరి గుప్తము
మహామహులు పయనించిన మార్గమే మరి యోగ్యము .
సమాప్తము
The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.