భారతీయ చరిత్రను వక్రీకరించడానికి నెహ్రూ గారు ఎంచుకున్న మూలస్థంభం ఆయనే భాష్యం చెప్పిన లౌకికవాదం. ఆ లౌకికవాదమే స్వాతంత్ర్యం వచ్చిన ఏబది సంవత్సరాల పైననే దేశం ఆర్థికమైన దోపిడికి వెసులుబాటు కలిగించింది. గాంధీగారి విఫల ప్రయోగాలు ఈ వక్రీకరణకు బీజారోపణం గావించాయి. వక్రీకరణకు వ్యవస్థీకృతం చేసిన ఘనత నెహ్రూ నవాబు గారిదే. భారతీయ చారిత్రక సత్యాలను రూపుమాపి, శాశ్వతమైన సాంఘిక సంక్షోభానికి గురి చేసి, నేటి యువతయొక్క పతనావస్థకు దారితీశాయి. గత రెండు దశాబ్దాలలో దృగ్గోచర మౌతున్న ఘటనల సారాంశం - గతాన్ని సరయిన రీతిలో అధ్యయనం చేయకపోతే భవిష్యత్తు ఆగమ్యగోచరం అని స్పష్టమౌతుంది.
బౌద్ధికంగా విజ్ఞులైన కొందరు నెహ్రూ గారి అనుయాయులు చరిత్ర అంటే తేదీలు వంశపరంపరలు కాదని అవగాహనతో రక్షించుకొనవలసిన విలువలని సరిగానే గుర్తించారు. దాని పరిణామమే కులపతి కే.యం. మున్షీ గారి ఆధ్వర్యవం లో రూపు దిద్దుకున్నబృహత్తరమైన కార్యక్రమం - పదకొండు గ్రంథాలయ సంపుటి "హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్" ఈ విస్తృతమైన భారతీయ చరిత్ర గురించి వారి మాటల్లోనే:
భారతీయులు, భారతీయ ఆత్మదర్శనం చేసుకొనే విధానాన్ని గూర్చి ప్రపంచానికి తెలియజేసే ఒక సంగ్రహ పరిచయం. భారత చరిత్ర అంటే విదేశ దండ యాత్రలు, వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించడం మటుకే కాదు. నిజమైన చరిత్ర అంటే ఆ దేశంలో నివసించే ప్రజల చరిత్ర. ఒక యుగం నుంచి మరో యుగానికి జరిగిన ప్రస్థానంలో మానవుని విజయాలు మహోన్నత సంప్రదాయాలుగామారి భద్రపరచబడిన రచన. . . . చరిత్ర యొక్క ముఖ్యోద్దేశం .. . . . యుగయుగానికీ ఆ దేశవాసులను ప్రేరేపించి ఏకీకృతం చేసిన విలువలను, పరిశోధించి వెల్లడిచేయడమే.
ఆచార్య ఆర్ . సీ . ముజుందార్ గారి నేతృత్వంలో ఈ పదకొండు భారత దేశ చరిత్ర గ్రంథాల సంపుటి శ్రీ కే. యం. మున్షీ గారి దార్శనిక దృష్టిని సఫలం చేశాయి. ఈ గ్రంథ సంపుటి మార్కెట్లో ప్రవేశించి ప్రశంసలు పొందినప్పటికీ, ఎక్కువకాలం కాకముందే మార్క్సిస్టుల గ్రహణం ఆ గ్రంథాలకు పట్టినట్లయింది.
భారతదేశ చరిత్ర రచనలో ఈ సంకలనానికి తనదైన బాణీలో అద్వితీయమైన అంతర్దృష్టి ని ప్రసాదించిన సమకాలీన ఋషితుల్యులు డీ వీ గుండప్ప గారి కలం నుంచి వెలువడి, ప్రాచుర్యంలోకి రాని ఒక ఉదంతం ఉన్నది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కలిగిన విషాదాల్లో జాతీయ జీవన స్రవంతిలో గుర్తింపునుంచి దూరమైన ఒక మహా మనీషి శ్రీ డీవీజీ. 1940 దశకం మధ్యకాలం వరకూ అప్పటి దివాన్లు , మహారాజులు , స్వాతంత్ర్య యోధులు , సంపాదకులు , సంగీత సాహిత్య వేత్తలు వారి సలహాలకోసం , వారి ఓదార్పు మాటల కోసం నిత్యం సంప్రదిస్తూ ఉండేవారు. కర్ణాటకలో కూడా ఇప్పటికీ వారి ప్రసిద్ధ రచన ' మంకుతిమ్మన కగ్గ ' బహుళ ప్రాచుర్యం పొందినప్పటికీ, వారి ఇంగ్లీషు , కన్నడ భాషలలొ 15000 వేల పేజీల రచనలలో వారు స్పృశించని విషయంలేదు. ఆయన స్నేహితుడు సమకాలికుడు కవి రచయిత ఆయనను చెట్టులో పైనున్న ఆకులు మాత్రమే తినే జిరాఫీ తో పోల్చారు.అంత ఎత్తు మాత్రమే కాకుండా, సాగరగర్భం గాలించి మణిమాణిక్యాలను వెలికితీసే సాగరగర్భ అన్వేషకునివలె లోతైన విషయాల సారాన్ని తన రచనలలో, తన ఉపన్యాసాల ద్వారా వెలుగులోకితెచ్చినట్లుగా కూడా భావించాలి.
ఆకాశవాణి ద్వారా జులై 1954 లో ప్రసారమైన వారి ఉపన్యాసం గురించి చాలామందికి తెలియదు. ' హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్' సంపుటాల్లో 'ది క్లాసికల్ ఏజ్' అనే మూడవ సంపుటానికి వారి సమీక్ష ప్రసారమైంది. వారి సమీక్షలో - 'ఇది భారతీయులు వ్రాసిన భారతదేశ చరిత్ర ' అని నొక్కి చెప్పారు. అది సాధారణమైన సమీక్ష కాదు, పుస్తకంలోని విషయాలను లోతుగా అధ్యయనం చేసి, గ్రంథస్థమైన సంగతులను సమగ్రంగాను, అధికారికముగానూ చర్చించిన అపూర్వ సమీక్ష. డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించ వలసిన ప్రసంగ వ్యాసం. ఎన్నో పర్యాయములు చదివిన మీదట అందులో ఏ ఒక్క వాక్యంగాని అంశం గాని సంక్షిప్తము చేయ వీలులేని మహోన్నతవ్యాసరాజమని నా కనిపించింది.
చరిత్రను ఎలా దర్శించాలి, ఎలా వ్రాయాలి అనే విషయంలో డీవీజీ అంతర్దృష్టి నిశితము, అమూల్యము. చరిత్ర మీద ఆయన దృష్టి ఎటువంటిదో ఇలా అన్నారు:
చరిత్ర అనేది భావోద్రేకాన్ని కలిగించాలన్నా, అన్వేషణకు పురికొల్పి మేథోమథనం జరగాలన్నా, అది ఉత్తేజాన్ని కలిగించేట్లుగా ఉండాలి. సత్యాన్ని అంటిపెట్టుకునే ఉంటూనే దయా హృదయుడై ఉండడం , యదార్థాన్ని చెప్పడంలో కరుణ కలిగిఉండడం అసాధ్యమా ? ఊహ - మనస్సాక్షి పరస్పర విరుద్ధములైనవా ? వాటిని సమన్వయం చేయటమే నిజమైన చారిత్రకారుని కళ. కథనం నడక చురుకుగా , స్పష్టంగా , సచేతనముగా ఉండాలి.
ఈ అంతర్దృష్టి పాఠశాలలో లేదా విశ్వవిద్యాలయాల్లో చెప్పగలిగే విషయం కాదు. పాఠ్యాంశాలు ఎంపిక చెయ్యడంలో చిన్న వయస్సు నుండే సానుకూల వాతావరణం కలిగించగలిగితే విద్యార్థులలో అటువంటి అంతర్దృష్టి ఏర్పడి పెరిగి వృద్ధిచెందే అవకాశం ఉన్నది. డీవీజీ జీవితమనే విశ్వవిద్యాలయంనుంచే విద్యాభ్యాసం ప్రారంభించి దానికే ఉపకులపతి అయినారు.
డీవీజీ గారి సమీక్ష ఏ విషయమును కూడా వదలనంత సమగ్రము. ‘ క్లాసికల్ ఏజ్ ' సంపుటము సమీక్ష నుంచి ఒక చిన్న మచ్చుతునక.
వందల సంవత్సరాలు గడిచిపోయిన ఒక శకములోని లక్షణాలను క్లుప్తముగా చెప్పగలగడం గొప్పదే అయినా అది కచ్ఛితత్వము , సంపూర్ణత అనే రెండు పరీక్షలలో ఉత్తీర్ణత పొందవలసి ఉంటుంది చరిత్ర ఒక పథకం ప్రకారం నడిస్తే సులభంగా ఉంటుంది. కాని జనజీవిత స్రవంతిలో అది అడవిలో పడిన వర్షపు నీటి కాలువ వంటిది - ఆకస్మికము - చంచలము - ఎటుపోతుందో తెలియదు - ప్రవాహం ఎన్ని కాలువలుగా మారుతుందో గుర్తించి వాటికి నామఫలకాలు పెట్టడం అంతగా సాధ్యమయ్యే పనికాదు.’
సంపుటము అమ్మకానికి పెట్టిన ధర ₹ 35. ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తమైనందున భారతీయులచే వ్రాయబడిన ఈ భారత దేశ చరిత్ర నిజంగా భారతీయులకేనా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అలాచెప్పడంలో వారి ఉద్దేశ్యం అంతటి ఉత్కృష్టమైన రచనలు వీలైనంత ఎక్కువమందికి అందుబాటులో ఉండాలన్న ఆకాంక్ష మాత్రమే. ఆ రోజుల్లో డీవీజీ గారి రచనలు ఒక రూపాయి నుండి ₹ 5 లోపలే లభ్యమయ్యేవి.
భారతదేశ చరిత్ర, భారతదేశయు యొక్క సనాతన సంస్కృతిక ఏకరూపతను ప్రతిపాదించేదిగా ఉండాలని అభిలషించారు. వారి ఒక ఉపన్యాసములో డా.డీ.సీ. సర్కార్ గారిని మృదువుగా మందలించారు.
రెండవది - 320 - 750 ఏ. డి. వరకు గల భారత చరిత్రను ప్రాచీన యుగముగా ఎందుకు అన్నారు ? ఐరోపా సాహిత్య చరిత్రలో ప్రాచీనయుగము అంటే గ్రీకు లాటిన్ లు పరిఢవిల్లిన యుగము. కాల్పనికత నుండి దూరమైన యుగము. భారతీయ సాహిత్య చరిత్రకు గ్రీసు, రోమ్ ల సాహిత్య చరిత్రలకు సమాంతరత ఉన్నదా అనేది ప్రశ్న. కాళిదాసు సాహిత్య ప్రక్రియలను వైదిక , పౌరాణిక సాహిత్యము నుండి విడదీసి చెప్పాలంటే దాన్ని మనమే సూచించ గలుగుతాము. అలాగే ఈ సంపుటాన్ని సంస్కృతము లేదా భారతీయ భాషలలోకి అనువదించాలంటే ' క్లాసికల్ ' అనే పదానికి బదులుగా ఏ పేరు వాడాలి ? మనకు ఆ పదం ఎంత అభారతీయమో, అని అనిపించకమానదు.
తనలాగా ఆలోచించే సమకాలికుల బృందములో నిర్విరామంగా ఒకే నాణానికిగల రెండు పార్శ్వాలను నొక్కి చెప్తూండేవారు . (i ) బౌద్ధిక , సాంస్కృతిక వలసవాద ఉప్పెనలో కొట్టుకుపోకుండా చూడడం (ii) వలసవాద తత్వంలో మునిగిన మెదళ్ళను ఉతికి శుభ్రం చేయడం. చరిత్ర అనే విభాగము లోనే వలసవాదానికి అత్యధిక ఊతం లభించడం కారణం కావచ్చు.
ఇదంతా చదివిన తరువాత భారతీయులు , భారతదేశ చరిత్ర వ్రాయాలనుకొనేవారెవరయినా విధివిధానాలకు సంబంధించిన చిట్కాలను తెలుసుకొని రచనకు ఉపక్రమించవచ్చు. అలా వ్రాయడానికి మొదలుపెట్టిన చరిత్ర - ఎలా ఉండాలి ? - సంస్కృతి సంస్కారాలు ప్రతిబింబించాలి, గద్యము సౌష్టవంగా ఉండాలి, నడక హుందాగా ఉత్కంఠ రేకెత్తించే విధముగా ఉండాలి. శైలి ఉత్సాహాన్ని కలిగించాలి. భావన అపరాధభావరహితమై ఉండాలి; సంశయభరితము కారాదు. ఎట్టి పరిస్థితిలోనూ వ్యాపార దృష్టి కనబరచ రాదు. పైన చెప్పినవన్నీ రచనలో ఉంటే వ్యాపారమే రచయితను వెతుక్కుంటూ వస్తుంది.
సంచలన వార్తలు వ్రాసే రాజకీయ విలేకరి యొక్క శైలి చరిత్ర వ్రాసేందుకు యోగ్యమైనది కాదు. అది ప్రజలను మభ్యపెడుతుందే తప్ప స్ఫూర్తిని కలిగించదు. డీవీజీ మాటల్లో అది ఎలా ఉండాలో చూద్దాం - ‘ ఇది ఇలాగే జరిగి ఉంటుంది' అని వ్రాయడం ' ఇలా జరగకుండా ఉండడానికి వీల్లేదు ' అనే పద్ధతిలో వ్రాసిన రచనలు చదువరి ఒక నిశ్చయానికి వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తుంది, చదువరిలో కలగవలసిన ఉత్సాహాన్ని త్రుంచి వేస్తుంది.
డీవీజీ దార్శనిక దృష్టిలో, చరిత్ర రచనావిధానం లో సంస్కృతి పట్ల గౌరవం , స్వీయ వైఖరి , రచయిత సజ్జనత్వం మూలభూతమైనవిగా ఉండాలి. డీవీజీ వంటి సంస్కారయుతులైన భారతీయులలో వారి జీవితవిధానము , వ్యక్తిత్వాలలో వైరుధ్యం ఉండదు. వారి విధానమే వారి వ్యక్తిగత జీవితము. నాలుగు తరాల స్వాతంత్ర్య అనంతర విద్య అనబడే దుర్విద్య దారీ తెన్నూ తెలియని భారతీయుల మందను తయారుచేసింది - భారతీయమన్నా , చరిత్ర అన్నా అవగాహనలేని వారు చరిత్ర వ్రాసే పద్దతులను తెలుసుకోవడానికి ఎటువంటి ఉత్సాహం చూపగలరు? 'శాస్త్రీయ చరిత్రకారుల'మని చెప్పి, చరిత్రలో అసంబద్ధమైన విషయాలను చొప్పించిన చరిత్రకారులను నిరసించిన ట్రెవల్యన్ వంటి సుప్రసిద్ధ చరిత్రకారులు కూడా ఇరువయ్యవ శతాబ్దపు మొదటి భాగంలో కూడా ఉన్నారని మరచిపోరాదు. అటువంటి చరిత్రకారులను ఆయన “Potsdam Guards of learning.” అని నిరసించారు - విగ్రహ పుష్టి తప్ప సరుకు లేనివారని భావం .
డీవీజీ తనదైన అసమాన శైలిలో ట్రెవల్యన్ చెప్పినమాటలను అద్భుతమైన వాక్యాలలో వివరించారు.
మన ఈ పుస్తకంలో పురాశాస్త్ర పరిశోధకుడు కథకుడిని అధిగమించాడు. కథాక్రమంలో అడుగడుగునా ఒక వ్యక్తిత్వ నిర్ధారణలో కాని, కాలనిర్ణయంలో కాని నిశితమైన వాదోపవాదాల చర్చలో మనం మునిగిపోవడం జరుగుతుంది. రచయిత ఎప్పుడూ తన మనోనేత్రం ముందు ఒక తీక్ష్ణమైన విమర్శకుడిని లేదా ప్రత్యర్థిని చూస్తూ ఉంటాడు. మరొకప్రక్క వినోదమో, విజ్ఞానమో కాంక్షించి చదివే సామాన్య పాఠకుడు తన ప్రాచీన పూర్వీకుడు సాధించిన విజయాలను గురించి తెలుసుకోవాలని హృదయపూర్వకంగా ఎదురుచూస్తూ ఉంటాడు. కాబట్టి బహిరంగంగా కనబడే విషయానికి ప్రాధాన్యత ఇస్తే అంతర్గత భావం సామాన్య పాఠకుడికి అందకుండా పోయే ప్రమాదం ఉంది.
పరోక్షంగా డీవీజీ సుప్రసిద్ద చరిత్రకారులు క్లారేన్దోన్ , గిబ్బన్ , కార్లైల్ , డబ్ల్యూ. ఈ. లెకీ వంటి వారి పరంపరను, మన పరంపరలో కల్హణుడు వంటి వారిని గుర్తుచేస్తున్నారు. వీరందరూ కూడా చరిత్ర రచనకు ఒక సాహిత్యకళ వలె ఔన్నత్యాన్ని ప్రసాదించిన వాళ్ళు. జీవిత చరిత్రలు, చారిత్రక రచనలు చెయ్యడంలో మళ్ళీ నేడు అటువంటి స్థాయిలో ధనంజయ కీర్ సిద్ధహస్తులు.
ముగింపుకు ముందుగా డీవీజీ గారి ఆణిముత్యం మరొకటి.
మన దేశంలో రెండువందల సంవత్సరాలుగా అతలాకుతలం అవుతున్న ప్రపంచాన్ని చూస్తూ, అదే క్షేమమనీ, ఆరోగ్య హేతువనీ భావిస్తూ వచ్చాము. ఎందుకంటే సమతుల్యత , స్థిరత్వం అనేవి మన దృష్టిలో స్తబ్ధతగా రోగలక్షణం గా స్థిరపడిపోయాయి. ఇది తప్పుడు అభిప్రాయం. నిజమైన అభివృద్ధి ఒక తిరిగే సుడిగుండం కాని సంచలనం కాని కాదు; అభివృద్ధికి ముందు , తరువాత కూడా ఒక చలనరహిత స్థితి ఉంటుంది.
The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.